Friday, 3 May 2013

ఆపరా నీ...........


అది ఒక తరగతి గది..
మాస్టారు గదిలో అడుగు పెట్టగానే ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్..
మాస్టారు: ఈ రోజు మీకు పాఠం కంటే ముందు ఒక విషయం చెప్పాల్రా!
పిల్లలు: ఏంటండీ అది?
మాస్టారు: నా కవిత ఒకటి ఇవాళ్టి పేపర్లో పడిందిరా..
 అల్లరి గడుగ్గాయి(ఓ.అ.గ.): అయ్యో పాపం, దెబ్బలేమైనా తగిలాయా సార్?
                                         
మాస్టారు: నీ మొహం మండా, పేపర్లో పడటం అంటే, కవిత ప్రచురించారు అని అర్థం రా తిక్క వెధవా...
ఓ.అ.గ.: అవునా, ఐతే నేను కూడా ఒక కవిత రాసి పంపిస్తానండి, ఎలా రాయలో చెప్పండీ!
మాస్టారు: ముందుగా ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి, ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకొని..
ఓ.అ.గ.: ఆ చూసుకొని?
మాస్టారు: అప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ..
ఓ.అ.గ.: ఆ చూస్తూ..
మాస్టారు: వచ్చే ఆలొచనలని కాగితం మీద పెట్టు, కాని ప్రాస ఉండాలిరా, అదే కవిత..
.అ.గ(మనసులో): ఓహొ, ఇంత సులభమా..సరే ఇవాళ సాయంత్రమే మన ఊరి చివర ఉన్న కొండ దగ్గరికి వెళ్ళి, కవిత రాసేస్తా, నా తఢాకా చూపిస్తా...

(మరుసటి రోజు) 
మళ్ళీ మాస్టారు గదిలో అడుగు పెట్టగానే ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్..
ఓ.అ.గ.: సార్, నేను ఒక కవిత రాసాను సార్..
మాస్టారు: ఏంటి అప్పుడే?
ఓ.అ.గ(గోముగా).: అవును సార్, మీరు వినాలి!
మాస్టారు:  సరే చదవరా..

ఓ.అ.గ.(గొంతు సవరించుకొని): 
అదిగదిగో కొండ..
అదిగదిగో కొండ..
కొండ మీద బండ..
బండ మీద కుండ..
కుండలోన తొండ..

ఎగిరింది తొండ..
పడింది బండ..
పగిలింది కుండ..

మాస్టారు:  ఆపరా నీ ము**... #$%@*

(ఆయన ఏం తిట్టారో మీకు అర్థం అయ్యిందిగా..)


(ఈ నాటకం మాతో వేయించాలని, 10 క్లాస్లో మా సంస్కృతం సార్ ప్రయత్నించారు, కాని కుదరలేదు, కాని ఈ కవిత మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది.. :-))  

Wednesday, 24 April 2013

భ్లాగుల్లో నేను చూసినవీ, చేసినవీనూ..


కొన్ని రోజుల క్రితం..అంటే నేనింకా కూడలి చూస్తూ మాత్రమే ఉన్న రోజుల్లో..అవ్వారు పార్వతి గారి బ్లాగ్ లో "వాల్ హ్యంగింగ్" అనే టపా చూసా..
స్వతహాగా ఇలాంటి పేపర్ క్రాఫ్ట్ లు చూడగానే చేసేయకపొతే నా చేతులు అస్సలు ఊరుకోవు, ఇంకేముందీ వెంటనే బజారుకు పరిగెత్తుకెళ్ళి  కావలసినవి తెచ్చేసుకొని మొదలు పెట్టేసా..

మాములుగా అయితే నేనూ, నా రూమేరా(రూo మేట్ రాకాసి-స్వాతి) కలిసి ఏదయినా ఇలాంటిది మొదలు పెట్టామంటే అది చిరిగి చాటంతయి చాపంత అవుతుంది, కాని ఆ రోజు నా అదృష్టం బాగుండి అది ఊరికి వెళ్ళింది, సరే కదా అని నేను చేసేశా... ఆ "వాల్ హ్యంగింగ్"తో పాటు మిగిలిన అన్ని క్రాఫ్ట్ టపాలు చూసేసి అవి కూడా చేసేసి ఇలా గోడకు అంటించా...

ఆ తర్వాత మా రూమేరా వచ్చి చూసి, తను లేకుండా నేను ఇంత మహత్కార్యం చేయడం జీర్ణించుకోలేక, కుళ్ళుతో, నా వాల్ హ్యాంగింగ్ ఏమీ బాగా లేదు, మరీ చప్పగా(దాని బాషలో సింపుల్ గా) ఉంది, ఇంకోటి చేద్దాం అంది..నేను కూడా అవునేమో అనుకొని, సరే సరే అన్నా...

కాని అప్పటికే తెచ్చిన సరుకంతా(అంటే పేపేర్లూ, కలర్లూ) అయిపోయింది అని, మళ్ళీ బజారుకు పరుగెట్టి నేను తెచ్చిన కలర్ కాకుండా, వేరే కలర్ పేపర్ లు, ఇంకా రంగులూ, చెంకీలూ, ఇలా  ఏవేవో అన్నీ తెచ్చేసి, మళ్ళీ మొదలు పెట్టాం...  ఇలా.......
పూబాలలు

మెరుగులు దిద్దుకుంటున్న నక్షత్రాలు
                                                           మేము వాడిన వస్తువులు...

చివరగా అది ఇలా తయారు అయ్యింది...


అంతా అయిపోయాక చూస్తే, కాస్త ఏదోలా అనిపించింది.. :)

మీరే చెప్పండి, ఈ రెండిట్లో ఏది బాగుందో..(నేను చేసిందే బాగుందని మా రూమేరా అంటోంది మరి..)


స్వాతికి ప్రత్యేక కృతజ్ఞతలతో...Thursday, 4 April 2013

అనుకోని ప్రయాణం .. అందమైన పరిణామం.. - 2


మార్చ్ 31, ఉదయం 6:45
పొద్దున లేచాక, ఆరుబయట కూర్చుంటే అనిపించింది, ఎంత హాయిగా ఉందో ఇక్కడ అని! ఏ రణగొణ ధ్వనులూ లేకుండా, స్వచ్చమైన గాలిలో,అమాయకమైన పిల్లలతో, అబ్బా కాలం అలా ఆగిపొతే బాగుండు అనిపించేలా...
వెంటనే గుర్తు వచ్చింది నేను తెచ్చిన రంగుల గురించి, ఇంకేముంది రంగంలోకి దిగిపోయాం అందరం..
అప్పటిదాక అమాయకంగా కనిపించిన పిల్లల విశ్వరూపాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి..ఒకరు పిచికారితో చల్లుతుంటే, ఇంకొకరు మగ్ తో,ఇంకొకరు ఏకంగా బకెట్ తో,అబ్బో చూడటానికి రెండు కళ్ళూ చాలలేదు..మొదట కొంతమంది పిల్లలు నీళ్ళు మీద పడగానే ఏడిచారు, కాని వాళ్ళే చివరకు వచ్చేసరికి బకెట్ తో చల్లేసారు ఎదుటివారిమీద...

అలా రంగులన్నీ ఐపోయేవరకూ ఆడారు. ఆడి ఆడి అలసి సొలసి ఆడటం ఆపేస్తారేమో అని నేను అనుకునేంతలో మళ్ళీ క్రికెట్ మొదలుపెట్టేసారు, ఈ సారి రాజ్ గారి కెమెరాలో చార్జింగ్ ఐపోయేవరకూ, అందరి(పిల్లలు మాత్రం కాదండోయ్) ఓపిక ఐపోయే వరకూ ఆడుకున్నారు.
మార్చ్ 31, మధ్యాహ్నం 12:45
తర్వాత అందరం తాడిపత్రి గుడికి వెళ్ళి, అట్నించి విజయ మోహన్ గారి బౄందావనముకి వెళ్ళాం. బయట ఎంత ఎండగా వుందో ఇంట్లో అంత హాయిగా వుంది. వెళ్ళగానే చల్లని మంచినీళ్ళూ, వెంటనే పాలకోవా, బాదుషా, కాకరకాయ చిప్సు, వెనువెంటనే పుచ్చకాయ ముక్కలు, అబ్బో.. ఇల్లంతా చూస్తూ, పెట్టినవి తింటూ ఉంటే మనసూ, కడుపూ రెండూ నిండిపోయాయి. 
       
ఆ సొరకాయలను చూస్తే నాలోని 'దొంగ' ఎక్కడ బయటకు వస్తుందోనని ఆనంద్ తెగ భయపడిపోయాడు.. :)  బయట మామిడి చెట్టుకు కాసిన కాయలు చూసి  చేతిని అదుపులో పెట్టుకోవడం నిజంగా చాలా కష్టం అయ్యింది. 'మిథునం' పుస్తకం గుర్తు వచ్చింది మళ్ళీ! 
అక్కడి నించి వచ్చేస్తుంటే మనసు రానని మొరాయించింది..ఈ సారి మాత్రం కనీసం ఒక్కరోజైనా(విజయ్ మోహన్ గారిని ఎలాగైనా బతిమిలాడి) ఉండాలి అని అనుకొని తిరుగు ప్రయాణం జీవనికి...

మార్చ్ 31, మధ్యాహ్నం 3:00
జీవనిలో ఇంకోసారి బాగా తినేసి, అందరికీ వీడుకోలు ఇచ్చేసి, బయలుదేరాం.

జీవనిలో అడుగుపెట్టేటప్పుడు ఉన్న భయాలు, సంకోచాలు, వదిలి వెళ్ళేప్పుడు అందమైన జ్ఞాపకాలు, మరిచిపోలేని అనుభూతులుగా  మారిపోయాయి..నాకు తెలియకుండానే...

ఈ ప్రయాణంలో నేను గమనించిన ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి రాయకుండా ఉండలేకపోతున్నా..
  • సునంద గారు - ప్రసాద్ గారి భార్యగా, ఆయనకు అన్ని విధాలుగా సహకరించే వ్యక్తిగా మన అందరికీ తెలుసు ఈవిడ, నేను ఈవిడలో గమనించిన ఇంకో పార్ష్వ్యం ఏంటంటే, ఏదైనా తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి చూపించే ఆసక్తి. 
    •                                                        

పిల్లల కోసమని రెహ్మాన్ గారు ఒక గోళీల గేం తీచ్చారు,అందులో చివరికి ఒక గోళీ మాత్రమే ఉండేట్టు ఆడాలి, అందరూ ప్రయత్నించారు, ఎవరూ చేయలేకపొవడంతో, నేను చిన్నప్పుడు నేర్చుకున్నది గుర్తు తెచ్చుకొని చేసా.. వెంటనే ఆవిడ నేను అది ఆవిడకు నేర్పించే వరకూ వదలలేదు.. :)
 అంతే కాదు, ఒక్కసారి చేస్తే మరచిపొతారేమోనని 5-6 సార్లు చేసారు, అక్కడితో ఆగకుండా వెంటనే పిల్లలకు నేర్పించటం మొదలు పెట్టారు..
సునంద గారి నించి నేను నేర్చుకున్న విషయాలు:  
    • Enthusiasm to learn new things
    • Try until you get Perfection
    • Sharing with others


ఇంకో విషయం ఏంటంటే ఇంటికి వచ్చిన వారితో కొత్త, పాత అని లేకుండా చాలా త్వరగా కలిసిపోవటం... నాకైతే ఏదో కొత్త చోటుకి వచ్చానన్న అలోచనే రానివ్వలేదు అందరూ, ముఖ్యంగా సునంద గారు, ప్రసాద్ గారి అమ్మ గారు.

మా ఈ ప్రయాణం జీవితాంతం గుర్తుంచుకునేలా చేసిన ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకూ, రాజ్, కార్తీక్, బంతి, రెహ్మాన్, సురేష్, నరేష్, నాగార్జున, భాస్కర్ గార్లకు ఈ టపా అంకితం .. :)   

Wednesday, 3 April 2013

అనుకోని ప్రయాణం .. అందమైన పరిణామం..


             అనుకోని ప్రయాణం .. అందమైన పరిణామం..


ఈ అనుకోని ప్రయాణంలో నా అనుభవాలు..

మార్చ్ 29, ఉదయం 11:00
ఎప్పటిలాగానే కూడలి చూస్తుండగా 'జీవని’ బ్లాగ్ లో 'చాలా రోజుల తర్వాత జీవనికి వస్తున్న బ్లాగర్లు... అందరికీ ఆహ్వానం' అన్న శీర్షిక చూసి నన్నే పిలిచేసినంత ఆనందం వేసింది. ఎలాగూ వారాంతమే కదా అని వెళ్ళాలని అనుకున్నా. అనుకోవడమైతే అనుకున్నా కాని మళ్ళీ ఏదో సంకోచం..వచ్చే వాళ్ళందరి బ్లాగులు నేను చదువుతాను కానీ, వాళ్ళెవరికీ నేను తెలియను కదా అనిపించింది.. అదేదో సినిమాలో చెప్పినట్టు 'నాకు చంద్రబాబునాయుడు బాగా తెలుసు కానీ నేనే ఆయనకు తెలీదు’ అన్నాట్ట ఎవడో నాలాంటి వాడే... ఐనా ఎందుకో బాగా బలంగా అనిపించింది వెళ్ళాలి అని, అంతే వెంటనే ప్రసాద్ గారికి ఫోన్ చేసాను, 'నేను ఫలానా అండి, రేపు జీవనికి వద్దామని అనుకుంటున్నాము' అని చెప్పాను, ఆయన వెంటనే 'వచ్చేయండి’ అనేసారు.
వెంటనే కాబోయే శ్రీవారికి(ఆనంద్) ఫోన్ చేసి అడిగా 'మనం రేపు అనంతపురం వెళ్దామా' అని, ఎప్పటిలాగానే 'నీ ఇష్టం' అనేసారు, ఇలా అంటాడని ముందే తెలిసినా, ఒకసారి అడగాలి కదా, మన వైపు నించి ఏ తప్పూ ఉండకూడదు కదా మరి.. ;-)

వెంటనే ఇంకో ఆలోచన, పిల్లలకి ఏమి తీసుకొని వెళ్ళాలి అని .. సాయంత్రం వరకూ అలోచించినా కూడా ఏమీ తట్టలేదు!

మార్చ్ 29, సాయంత్రం 7:00
పోనీ ఒకసారి అలా బయటకు వెళ్తే ఏమైన ఆలోచన వస్తుందేమోనని వెళ్ళా, 1 గంట తిరిగాను కాని ఏమి తీసుకెళ్ళాలొ తెలియలేదు...సరె అని తిరిగి ఇంటికి వచ్చేస్తుంటే అప్పుడు కనపడ్డాయి ఒక షాప్ లో బయట తగిలించిన రంగు పిచికారిలు..

వెంటనే గుర్తు వచ్చింది మొన్ననేగా హోలి ఐపొయింది అని..
వెంటనే ప్రసాద్ గారికి ఫొన్ చేసి అడిగాను 'హోలి చేసారా జీవనిలో' అని,
ఆయన 'లేదండి' అన్నారు...
ఇంకేం అలోచన వచ్చిందే తడవు అడిగేశా 'నేను తీసుకురానా రంగులు' అని
'తప్పకుండా' అన్నారాయన.
వెంటనే ఆ షాపులోకి వెళ్ళి ఆ పిచికారిలను పట్టుకొని అడిగా
'ఎన్ని ఉన్నాయి?'
ఆ షాపులో అబ్బాయి లెక్కపెట్టి '15' అని చెప్పాడు.
అయ్యో అన్నేనా అనిపించింది, ఇంక ఎంత వెతికినా దొరకలేదు..
'రంగులు?' అని అడిగితే
'లేవు' అనేసాడు...
ఇక ఆ తర్వాత కనిపించిన అన్ని షాపులూ తిరిగితే ఒక చోట మాత్రం 3 రంగులు దొరికాయి..ఏవో ఒకటిలే అని తీసుకుంటుంటే  ఓ బుడ్డాడు అప్పుడే వాళ్ళ నాన్నతో కలిసి ఆ షాప్ కి వచ్చాడు, నా చేతిలో రంగులు చూసి 'హోలి ఐపోయాక ఈ అక్క రంగులు కొంటుదేం?' అని అడిగాడు.. :((( వాళ్ళ నాన్న ఏమో నా వైపు చూసి 'హి హి హి' అని నవ్వి వెళ్ళిపొయాడు.. :( ఐనా కానీ నేనేమీ ఏడవలేదు.... :)


మార్చ్ 30, ఉదయం 4:30
అలారం దెబ్బకి లేచేసి, ఆనంద్ కి wake up call చేసేసి, త్వరత్వరగా తయారయి, బస్ స్టాండ్ కి వెల్లి అనంతపురం బస్ ఎక్కేసాం.
బస్ ఎక్కినప్పటినించి ఒకటే ఆలోచనలు, అక్కడ అందరూ ఎలా ఉంటారో, అసలు నన్ను పలకరిస్తారా, నాతో మాట్లడతారా, అని!
ఇలా అలోచనల్లో వుండగానే వచ్చేసింది అనంతపురం. పెద్దగా కష్టపడకుండానే జీవని చేరుకున్నాం, ప్రసాద్ గారి సాయంతో.

మేము వెళ్ళేసరికి, రెహ్మాన్ గారు నిద్రపోతున్నారు. లేచాక పరిచయాలు అయ్యేసరికి, రాజ్ గారు, కార్తీక్ గారు, భాస్కర్ గారు వచ్చారు, మళ్ళీ అందరి పరిచయం. చాలా త్వరగా కలిసిపొయారు అందరూ..
నాకేమో వీళ్ళందరూ పెద్ద పెద్ద celebrities లాగా అనిపిస్తున్నారు, ఆనంద్ ఏమో మాములుగా మాట్లాడేస్తున్నాడు..తను అసలు బ్లాగ్స్ ఫాలో అవ్వడు, వీళ్ళందరి బ్లాగ్స్ గురించి, వీళ్ళ టపాల గురించి, వీళ్ళ పంచ్ డయిలాగుల గురించి తెలిసిన నేను కాసేపు ఏం మాట్లడాలో తెలియక తికమక పడ్డాను, కాసేపే.. :)

తర్వాత జరిగినవి ఇక్కడ, ఇక్కడ, లేక ఇక్కడ చదవండి..ANR దేవదాసుని కృష్ణ మళ్ళీ తీసినట్టు వుంటుందని రాయడం లేదు (ఇది పచ్చల లక్ష్మీ నరేష్ గారి డయిలాగ్, వారి నుండి అనుమతి తీసుకోకుండా తస్కరించటం జరిగింది. ;-)  )

మరుసటి రోజు ప్రయాణం ఇంకో టపాలో ...